సమగ్ర కుటుంబ సర్వే జాతీయ రికార్డు

హైద‌రాబాద్, మే 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే చరిత్ర పుటల్లోకి ఎక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సమగ్ర కుటుంబ సర్వేను జాతీయ రికార్డుగా పేర్కొన్నది. ఈ మేరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికెట్ పంపారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం తదితర వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులు 1.09 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ సర్వే నిర్వహించారని, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తులు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తి పాస్తులు తదితర వివరాలన్నీ సేకరించారని అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడిందని సంస్థ పేర్కొన్నది.

Author: admin