31లోగా ఆస్తిప‌న్ను చెల్లించండి…రూ. 5ల‌క్ష‌ల బంప‌ర్ బ‌హుమ‌తి గెలుచుకోండి

హైద‌రాబాద్, మే 29 : 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్నును ఈ నెల 31వ తేదీలోగా చెల్లించేవారికి న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ప‌న్నును మే 31వ తేదీలోపు చెల్లించే ప‌న్నుదారుల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన 119 న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ ఆస్తిప‌న్నును ఆన్‌లైన్ విధానంతో పాటు జీహెచ్ఎంసి సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, ఈ-సేవా కేంద్రాలు, ఎంపిక చేసిన బ్యాంకుల బ్రాంచీల‌లో చెల్లించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. మే 1వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు ప‌న్ను చెల్లించిన‌వారంద‌రినీ ఈ బ‌హుమ‌తులు అంద‌జేయ‌డానికి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. బంప‌ర్‌ బ‌హుమ‌తి 1,00,000న‌గ‌దు, మొద‌టి బ‌హుమ‌తి 50,000 రూపాయ‌లు ఒకొక్క‌రి చొప్పున, రెండ‌వ బహుమ‌తి రూ. 25,000 న‌గ‌దు ఇద్ద‌రికి, మూడ‌వ బ‌హుమ‌తి 10,000 రూపాయ‌ల చొప్పున ఐదుగురికి, నాలుగ‌వ బ‌హుమ‌తి 5,000రూపాయ‌ల చొప్పున ప‌ది మందికి, క‌న్సోలేష‌న్ బ‌హుమ‌తిగా 100మందికి 2,000 రూపాయ‌ల చొప్పున అంద‌జేయ‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి వివ‌రించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 14,38,835 మంది ఆస్తిప‌న్ను చెల్లింపుదారులు ఉండ‌గా కేవ‌లం 2,83,148మంది మాత్ర‌మే ప్ర‌స్తుత సంవ‌త్స‌రం ఆస్తిపన్నును చెల్లించార‌ని పేర్కొన్నారు. ఇంకా 11,55,687మంది ఆస్తిప‌న్నును చెల్లించాల్సి ఉంద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. ఆస్తిప‌న్నును వెంట‌నే చెల్లించ‌డం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రింత స్వ‌చ్ఛ న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తిఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని క‌మిష‌న‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో విజ్ఞ‌ప్తి చేశారు.

Author: admin