మిషన్ కాకతీయ కు ప్ర‌పంచ వ్యాప్త ఆదర‌ణ

హైద‌రాబాద్, మే 31 : చికాగో యూనివర్శిటీ తో ఎం.వో.యు.
ఇప్పటికే రంగంలో మిషిగాన్ బృందం .
ఎంకే ఫలాలపై సర్వత్రా ఆసక్తి.
మంత్రి హరీష్ రావు హర్షం .
మిషన్ కాకతీయ పథకం పై ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తున్నది.     ఇందులో భాగంగానే చికాగో యూనివర్శిటీ సైతం మిషన్ కాకతీయ పథకం అమలు తీరు, దాని ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు చికాగో యూనివర్శిటీ , తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎం.ఓ.యు.జరగనున్నది. చికాగో యూనివర్శిటీతో ఎం.ఓ.యు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం, ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమిషనర్ డాక్టర్ జి.మల్సూర్ కు అనుమతించింది. మిషన్ కాకతీయ పై రెండేళ్ళ పాటు యునివర్శిటీ ఆఫ్ చికాగో అధ్యయనం చేయనున్నది.ఈ అధ్యయన బృందానికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సి.జి.జి ) లో వసతి తో పాటు అధ్యయన బృందానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని టి.ఎస్ . ప్రభుత్వం ఎంసిహెచ్ఆర్డి డైరక్టర్ జనరల్ ను కోరింది.ఇప్పటికే యేడాది కాలంగా మిషిగాన్ యూనివర్శిటీ బృందం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని ఎం.కె. ఫలితాలపై అధ్యయనం చేస్తున్నది. ఇప్పుడు తాజాగా ప్రతి ష్టాత్మక యూనివర్శిటీ ఆఫ్ చికాగో కూడా ముందుకు రావడం పట్ల తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు మంగళవారం నాడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చికాగో యూనివర్శిటీతో ఎంవో యు కుదుర్చుకోవడం వల్ల పరిశోధనలు మరింత లోతుగా జరిగి పధకాన్ని సమర్ధంగా అమలు చేయడానికి దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ లో పునరుద్ధరించిన చెరువుల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తున్నది? గ్రామీణ తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులపై ఎటువంటి గుణాత్మక ప్రభావం చూపుతుంది? పునరుద్ధరణకు ముందు చెరువును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సాగు పరిస్థితి, వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల దిగుబడి మిషన్ కాకతీయ కు పూర్వం, మిషన్ కాకతీయ తర్వాత ఎలా వున్నాయన్న అంశాలను చికాగో యూనివర్శిటీ అధ్యయనం చేస్తుంది.

    భూగర్భ జలాల పెరుగుదల, మిషన్ కాకతీయ అమలయిన అనంతరం పెరిగిన నీటిమట్టం, చెరువుల నుంచి నీటిని పంపిణీ చేసే పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. మిషన్ కాకతీయ మొదటి దశ పూర్తయింది. రెండోదశ అమలులో ఉన్నది. ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా మూడో దశ టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఎం కే పనులను నిరంతరం సమీక్షిస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం టెక్నాలజీ పరంగానూ నాబార్డు, బిట్స్ పిలానీ, ఐఐటి లతో ఇదివరకే ఒప్పదాలు చేసుకున్నది. చికాగో యానివర్శిటీ బృందంలో ఇండియా, అమెరికా లకు చెందిన విద్యార్ధులున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన మొత్తం ఖర్చును టాటా ట్రస్ట్ భరిస్తోంది.ఇందులో ఒక టీమ్ చెరువుల చరిత్ర ముఖ్యంగా కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు ఎలా వుండేవి? అవి క్రమంగా ఎలా అంతరించిపోయాయి? వాటిని పునర్నిర్మించేందుకు చేపడుతున్న చర్యలపై ప్రత్యేకంగా స్టడీ చేస్తుందని ‘కాడా ‘ కమిషనర్ మల్సూర్ మంగళవారం తెలిపారు. తమ అధ్యయన నివేదికను ముందుగా తెలంగాణ ప్రభుత్వానికే విధించాలని ఎంఓయు లో పేర్కొన్నారు.

Author: admin