సిలికాన్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ అద్బుత ప్రసంగం

హైద‌రాబాద్, జూన్ 1 : ఇప్పటికే పలు జాతీయ స్ధాయి అవార్డులందుకున్న మంత్రి కె.తారక రామారావు, ప్రపంచ స్ధాయి గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిలికాన్ వ్యాలీలో మంత్రి ప్రసంగించారు. TiE ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలపై మాట్లాడారు. సాంటక్లారా కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ మీటింగ్ కు వ్యాలీలోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. కొత్త రాష్ట్రం తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే తమ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు మంత్రి తారకరామారావు.అత్యుత్తమ విధానాలు, వినూత్నమైన ఆలోచనలతో ప్రగతిపథంలో దూసుకెళుతున్న తమ ప్రభుత్వ పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయన్నారు. ప్రభుత్వాలు తాత్కాలికం, విధానాలు శాశ్వతమన్నదే తమ నమ్మకమన్న కేటీఆర్, పారిశ్రామిక,వ్యవసాయం, సంక్షేమ రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానంలోని ప్రధానాంశాలైన సెల్ఫ్ స‌ర్టిఫికేషన్, 15 రోజుల్లో అనుమతులు, సింగిల్ విండో విధానాలను మంత్రి వివరించారు. Ease of doing business లో తెలంగాణ ప్రభుత్వానికి అత్యుత్తమ స్థానం ఉందన్న కేటీఆర్, తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పోటీ పడుతున్న సంస్థలే ఇందుకు సాక్ష్యాలన్నారు. సిలికాన్ వ్యాలీ లాంటి టెక్ ప్రపంచంలో వస్తున్న అవిష్కరణలు యువతకు స్పూర్తిని ఇస్తున్నాయని మంత్రి తారకరామారావు చెప్పారు. భారతదేశ యువత కూడా దిల్ మాంగే మోర్ అంటూ తమ అలోచనలను అవిష్కరణల వైపు తీసుకెళుతుందన్నారు. సిలికాన్ వ్యాలీ సక్సెస్ కు ఇక్కడి అనుకూల వాతవారణం ( ఈకో సిస్టమ్ ) ప్రధాన కారణమని, దానికి అనుగుణంగానే హైదరాబాద్ లోనూ నూతన అలోచనలను ప్రోత్సహించేందుకు టి హబ్ ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ అయిన టీ హబ్ అవుట్ పోస్ట్ ను సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. టిహబ్ లోని స్టార్ట్ అప్ లను స్కేల్ అప్స్( SCALE UPS)గా మార్చేందుకు సహకరించాలన్నారు. టాయ్ (Tie)తో పాటు సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ ఇచ్చి కంపెనీలకు ఉద్యోగులను అందించే టాస్క్ (TASK) లాంటి వినూత్నమైన పథకం ఇండియాలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. డిజిటల్ అక్షరాస్యత తో పాటు ఈ – గవర్నెన్సు నుంచి యం- గవర్నెన్సు ( మెబైల్ గవర్నెన్సు) తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలన్నారు. సాఫ్ట్ వేర్ తో పాటు మ్యానుఫాక్ఛరింగ్ రంగంలోనూ ఇండియాలో అపార అవకాశాలున్నాయన్న కేటీఆర్, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మెక్ ఇన్ తెలంగాణలో భాగంగా అద్భుతమైన పారిశ్రామిక,ఎలక్ట్రానిక్ పాలసీలను తీసుకొచ్చామన్నారు. తమ ప్రభుత్వ రూరల్ టెక్ పాలసీతో కామారెడ్డి లాంటి చిన్న టౌన్లలోనూ బీపీవో సెంటర్లు ప్రారంభమవుతున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఇన్నోవేషన్ పాలసీ, ఇమేజీ పాలసీ, ఐటి పాలసీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు ప్రతిరూపాలన్నారు. ఓ వైపు బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేస్తూనే మరో వైపు ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తారకరామారావు చెప్పారు. గ్రామీణ భారతాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పంచాయితీ రోడ్ల నిర్మాణం లాంటి మౌళిక వసతుల కల్పనతోపాటు పేదరికాన్ని తగ్గించేందుకు పెన్షన్ లను ఇస్తున్నామన్నారు. అద్భుతమైన విజన్ తో అనర్గళంగా కేటీఆర్ చేసిన ప్రసంగానికి వ్యాలీలోని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు ఫిదా అయ్యారు.మంత్రి ప్రసంగం ముగిశాక చప్పట్లతో కన్వెన్షన్ సెంటర్ మారుమోగింది .

Author: admin