ఒక ప్లాన్ ప్రకారమే అవకాశం లేకుండా చేశారు : వివేక్

హైదరాబాద్, 25 మార్చ్ 2019 : ఒక ప్లాన్ ప్రకారమే నేనే పోటీచేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరిక్షణంలో టికెట్ నిరాకరించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు ఆయన ఆటబొమ్మలు కొందరు నామీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిందని ఆరోపించారు. నా తండ్రి కాకా, నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామన్నారు. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చాను అని చెప్పారు వివేక్. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయడానికి పనిచేయడమే నేను చేసిన ద్రోహమా?. 2014లో టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా? అని ప్రశ్నించారు.
తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టారు. టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు అని అన్నారు. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆవేదనను వ్యక్తం చేశారు. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటా. కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు.

Author: Editor